గీతంలో ఉత్సాహభరితంగా కేక్ మిక్సింగ్ వేడుక

politics Telangana

_విద్యార్థులలో ఇనుమడించిన ఉత్సహం

– పండుగ వాతావరణంలో, కేరింతల మధ్య వేడుక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని హాస్పిటాలిటీ (ఆతిథ్య) విభాగం ఆధ్వర్యంలో శనివారం కేక్ మిక్సింగ్ వేడుకను ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా, విద్యార్థుల కేరింతల మధ్య పండుగ వాతావరణంలో నిర్వహించారు. హాస్పిటాలిటీ డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు, పలువురు సిబ్బంది, పాకశాస్త్ర నిపుణులు శాంతాక్రజ్ వేషధారణలో పాల్గొని ముందస్తు క్రిస్మస్ వేడుక వాతావరణాన్ని సృష్టించారు.కేక్ మిక్సింగ్ వేడుక అనేది క్రిస్మస్ సీజన్ ఆగమనాన్ని సూచించడమే గాక, కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సమయం. ఇదో గౌరవనీయమైన సంప్రదాయం. ఇది ఆనందాన్ని ప్రతిబింబించడమే గాక, విద్యార్థుల మధ్య ఐక్యత, బృంద స్ఫూర్తిలను చాటిచెబుతుంది. అలాగే సమృద్ధిగా పంటలనిచ్చిన ప్రకృతికి కృతజ్జతలు తెలియజేస్తుంది. ఎండు పళ్లు, గింజలు, సుగంధ ద్రవ్యాలు, రసాల శ్రేణిని కలపడం, వాటిని రెండు మూడు వారాల పాటు ఊరబెట్టి గొప్ప మిశ్రమాన్ని సృష్టించడం వంటి సంతోషకరమైన ఆచారంలో విద్యార్థులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన కేకులు తేమగా, రుచిగా, పండుగ స్ఫూర్తిని కలిగి ఉంటాయి.‘ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమం పాకశాస్త్ర కళలను ప్రోత్సహించడమే కాకుండా ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ తో సహా విభిన్న రంగాలకు చెందిన విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందిస్తుంది’ అని అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు.ఈ కేక్ మిక్సింగ్ వేడుకలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు చెఫ్ లు, ఆతిథ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటు గీతం ఉన్నతాధికారులు, ఇటు శాంతాక్రజ్ వేషధారణలోని విద్యార్థులు, సిబ్బంది.. సమ్మిళితంగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు.కేక్ మిక్సింగ్ కేవలం పాక శాస్త్ర కళే కాదు, ఇది ఆశ, ఆనందం యొక్క వేడుక. ఈ సంప్రదాయంలో పాల్గొనడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం, సంతోషం కలుగుతుందని పలువురు విశ్వసిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *