_పేరం గ్రూపుకే టోకరా వేసిన ఘనులు
_ఫ్లాట్ల కొనుగోలు దారుల నష్టపోకుండా పేరం గ్రూపు చర్యలు
మనవార్తలు ,పటాన్‌చెరు:
రుద్రారంలో ఓ వెంచర్ యాజమాన్యం, గ్రామస్థుల మధ్య నెలకొన్న భూ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే రుద్రారం గ్రామం 711, 712 సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 42.5 ఎకరాలను పేరం గ్రూప్ కొనుగోలు చేసింది. కానీ 711, 712 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల మూడు గుంటలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 41ఎకరాలకు మాత్రమే పేరం గ్రూపుకు పొజిషన్ లభించటంతో మిగతా భూమిని పేరం గ్రూపు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సదరు యాజమాన్యం ఉన్న భూములోనే వెంచర్ చేసి వినియోగదారులకు విక్రయించింది. ఈ నేపధ్యంలో 712 సర్వే నంబర్లో 17.5 గుంటల భూమిని 2019లో పేరం గ్రూపుకు విక్రయించిన గాండ నర్సింలు, 713 సర్వే నంబర్లో 2018 లో 3.5 ఎకరాలు విక్రయించిన అనసూయమ్మలు 2020 వ సంవత్సరంలో సర్దార్ హరిపాల సింగ్ కు ఆభూమిని సెకండ్ రిజిస్ట్రేషన్ చేయటంతో వీరిరువురిపై అప్పట్లో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ చేయటంతో ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.
ఈ నేపధ్యంలో గ్రామానికి చెందిన ఒడ్డే మల్లయ్య కూడా 712 సర్వే నంబరులో 1.34 గుంటల భూమిని పేరం గ్రూపుకి విక్రయించాడు. అయితే ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఒడ్డే మల్లయ్యకు 658 సర్వే నెంబరులో 1.20 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని మల్లయ్య కుటుంబసభ్యులు విలేకరులకు తెలిపారు. పేరం గ్రూపు యాజమాన్యం తమ భూమిని కబ్జా చేసిందని వారు ఆరోపించి యాజమాన్యం తో గొడవకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. సదరు వివాదంపై ఏడీ పలూమార్లు సర్వే నిర్వహించినట్టు సమాచారం. మల్లయ్య కుటుంబీకులు సర్వేను బేఖాతరు చేయడంతో పోలీస్ బందోబస్తుతో శనివారం హద్దులు నిర్ణయించారు. ఒడ్డే మల్లయ్య ఇటీవలే మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు పేరం యాజమాన్యంతో వాగ్వాదానికి దిగటంతో వివాదం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఏడి సర్వే ప్రామాణికంగా తీసుకొని వివాదానికి తెర దించకపోతే చర్యలు తప్పవని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం.