నియోజకవర్గ స్థాయి రైతు మహాధర్నాలో ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల
తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమం లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహా ధర్నా ను మండల కేంద్రమైన గుమ్మడిదల లో నిర్వహించారు. ఈ సమావేశానికి అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఖరాఖండీగా చెప్పడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడం అంటే పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని సూచించడమే అన్నారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వడ్లు కొనమని చెప్తుంటే మరోవైపు స్థానిక బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశానికి అన్నపూర్ణ గా నిలిచిన తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల మూలంగా 64 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. కేంద్ర రాష్ట్ర లకు చెందిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత సాగవుతుందా అంటూ ఎద్దేవా చేయడం రైతులను అవమానించడమే అన్నారు.