_విద్యావ్యవస్థలో అగ్రభాగాన నిలపండి
_విద్యార్థినీ, విద్యార్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఫలితాలు అత్యంత కీలకమని, బంగారు భవితకు బాటలు వేసుకునేందుకు ఈ ఫలితాలు ఎంతగానో ఉపకరిస్తాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో పటాన్చెరు నియోజకవర్గ అద్భుత ఫలితాలు సాధిస్తోందని అన్నారు.ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 960 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశాలని అన్నారు. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విద్యారంగం, వైద్యరంగం బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యున్నత ప్రమాణాలతో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రతి ప్రభుత్వ విద్యార్థిపై ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.
మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని తెలిపారు. పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడంతోపాటు, జిల్లాలోని మొట్టమొదటిసారిగా పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగిందని గుర్తు చేశారు. వీటితోపాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే మోటివేషనల్ తరగతుల సైతం నిర్వహించామని తెలిపారు. పటాన్చెరులో చేపట్టిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను ఈ విద్యా సంవత్సరం నుండి అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థినీ విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ నియోజకవర్గస్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ పిల్లలను సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ భీమ్ రెడ్డి, ఎంపీపీలు ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పోరేటర్లు మెట్టు కుమార్, యాదవ్ పుష్ప నగేష్, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్రెడ్డి, లలితా సోమిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ గౌడ్, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.