మనవార్తలు ,శేరిలింగంపల్లి :
లైసెన్స్ లేకుండా మందులు నిలువ ఉంచిన వ్యాపారికి లక్ష రూపాయల జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధించిన ఘటన కూకట్ పల్లి కోర్టు పరిధిలో జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ లోని మయూరి నగర్ లో సి.ఎస్.వి. ప్రసాద్ మరియు కాకూరి వివేకా అనే ఇద్దరు వ్యక్తులు ఇంపెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో సంబంధిత డ్రగ్ లైసెన్స్ లేకుండానే మందులను నిలువ ఉంచి వ్యాపారం చేస్తుండగా 2015 లో అప్పటి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ కేసు నమోదు చేసి న్యాయస్థానం నందు అప్పగించారు.
తరువాత 2017 లో ప్రస్తుత డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కోమల్ల దేవేందర్ రెడ్డి కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 లోని సెక్షన్ 18(c), 27(b)(ii), 27(d) ప్రకారం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసినారు. నేరం రుజువు కావడంతో కూకట్ పల్లి కోర్టు VIII అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నింధితులకు లక్ష రూపాయల జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు దేవేందర్ రెడ్డి. తెలిపారు. ఒకవేళ నిందితులు జరిమానా కట్టుని పక్షం లో జైలు శిక్షను మూడు నెలలకు పొడగిస్తూ తీర్పు ఇచ్చారని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు.