శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టిన దళిత బంధు

Hyderabad politics Telangana

_హే గాంధీ ఏంది ఇది

_అర్హులను కాదని అనుచరులకే పట్టం

_ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కుమ్మక్కై దోచిపెట్టిన వైనం ,సహకరించిన అధికారులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రజా ప్రతినిధులు అర్హులను కాదని తమ అనుచరులకు కట్టబెట్టి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు పథకం పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు చేరుకుంది. పేద ప్రజలకు చేరవలసిన దళిత బంధు ఖరీదైన కార్లలో తిరిగే, బహుళ అంతస్థుల భవనాలు ఉండి నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే అధికార పార్టీ కి చెందిన ధనవంతులు, నాయకులకు, ప్రజా ప్రతినిధుల అనుచరులకు అందజేశారు. దీంతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న దళిత బంధు పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన కార్లు, ఇతర పరికరాలు పథకంలో మంజూరయ్యే అన్ని అధికార పార్టీ వారికే దక్కుతున్నాయని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా పాలకుల తీరు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని, అందులో డివిజన్ కు 10మంది చొప్పున కడు పేదవారిని ఎంపిక చేయాలని నిబంధనలుండగా, వాటిని తుంగలో తొక్కి, లబ్దిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారింది.

చందానగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హాఫీజ్ పెట్, ఇలా అన్ని డివిజన్లలోను పైరవీకారులకు, తమ బంధుగణానికి కట్టబెట్టారు.లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు అర్హులేనంటా.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొన్ని డివిజన్ లలో నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు, ఖరీదైన కార్లలో తిరుగుతూ, బంగారు ఆభరణాలు కలిగిన వారికి దళిత బంధును అందజేశారు. అసలైన అర్హులకు మొండి చెయ్యి కూలి నాలి చేసుకొని పొట్టపోసుకునే వారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండగా, వారిని అసలు పరిగణలోకే తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన వాటిలో ఎక్కువ శాతం ఉన్నత కుటుంబాల వారికి మాత్రమే దళిత బంధు పథకం అమలు చేశారు.

రాని నిరుపేదలు ఇదేందని సంబంధికులను ప్రశ్నిస్తే రెండో విడతలో పరిశీలిస్తామని చెప్తున్నారని అర్హులైన బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ వారి ఆటలకు అడ్డేలేకుండా పోతుందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా వీటిపైన విచారణ జరిపించాలని, అర్హులైన వారికి పథకం ఫలితాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *