– పాల్గొన్న అంతర్జాతీయ నిపుణులు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.సదస్సు చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించి, సదస్సు ప్రొసీడింగ్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, విశ్వవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకచోట చేర్చి ఏనూత్న ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ఆధునిక కండెన్స్డ్ మేటర్ ఫిజిక్స్ లో తాజా పరిణామాలను పంచుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతుందన్నారు. సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి జెయిస్ కె.నగేష్ మాట్లాడుతూ, ఈ రంగంలోని అంతర్ విభాగ స్వభావాన్ని ప్రస్తావించడంతో పాటు యువత దీనిని సద్వినియోగం చేసుకుని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ అభిలషించారు.


ఈ సదస్సులో భాగంగా, బెంగళూరులోని ఐఐఎస్సీకి చెందిన ప్రొఫెసర్ విజయ్ బి.షెయోమ్, రష్యా సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఐటీఎంవో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇగోర్ యు. పొసాన్, టర్కీ ఇజ్మీర్ ఇనిష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ ఆర్.తుగ్రవల్ సెంగర్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ జె.సూర్యనారాయణ కీలకోపన్యాసాలు, ఆహ్వాన ఉపన్యాసాలు చేశారు. దీనికి సమాంతరంగా మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు కూడా నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం మాట్లాడుతూ, ఆ విభాగంలోని అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్ల వివరాలతో పాటు ఇప్పటివరకు దాదాపు 150 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు పేర్కొన్నారు. కన్వీనర్ డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తనకు 170 పరిశోధనా పత్రాలు అందాయని, వాటిలో నుంచి 112 ఎంపిక చేశానున్నారు. ఈ సదస్సులో నాలుగు కీలకోపన్యాసాలు, 12 ఆహ్వానిత ఉపన్యాసాలు, 36 మౌఖిక ప్రదర్శనలతో పాటు 60 పోస్టర్లను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు, నిపుణుల మధ్య ఫలవంతమైన చర్చలు, సహకారాలకు వేదికను కల్పిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.

