– గీతం విద్యార్థులకు డిప్యూటీ తహశీల్దార్ రాములు సూచన
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అర్హులు ఓటర్లుగా నమోదు కావాలని పటాన్చెరు డిప్యూటీ తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపునిచ్చారు. నూతన ఓటర్ల నమోదుపై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం ఆయన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ, జిల్లాలో నూతన ఓటరు నమోదు శాతం ఆశించిన దానికంటే తక్కువగా ఉందన్నారు. దానిపై అవగాహన కల్పించేందుకు గాను 18 ఏళ్లు నిండిన వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారు ఏవైనా మార్పు చేర్పులు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామన్నారు.జనవరి 1, 2023కు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఫారం-6ను నింపి నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు లేదా సవరణ (చిరునామా మార్పు) కోసం ఫారం-8 నింపాలని, ఇతర వివరాల కోసం 1950 టోల్ నంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు సంప్రదించవచ్చన్నారు. ఎన్నికల అధికారుల వివరాల కోసం www.nvsp.in యాప్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.ఈ విషయాలన్నీ తోటి విద్యార్థులకు తెలియజేసి, అర్హులైన వారందరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ సూచించారు.
