పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల మూతపడిన ఇంపీరియల్ గార్మెంట్స్ పరిశ్రమ మహిళా కార్మికులకు ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ఈఎస్ఐ నుండి రావలసిన బకాయిలు త్వరితగతిన ఇప్పించేందుకు కృషి చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం పరిశ్రమ మహిళా కార్మికులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమ మూసివేసిన సందర్భంలోనూ ప్రతి కార్మికురాలికి మూడు లక్షల రూపాయలకు పైగా పరిహారం అందించామని తెలిపారు.రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వపరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు..