_విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం
_ఒకే రోజు 5000 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ
_ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సతీష్ చే మోటివేషనల్ క్లాసెస్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవతరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సౌజన్యంతో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న 5000 మంది విద్యార్థులకు ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు డాక్టర్ సతీష్ చే మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. అనంతరం ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్, పరీక్షా ప్యాడ్, పెన్నులను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యారంగానికి వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. మన ఊరు మనబడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దీని మూలంగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరికని పరిస్థితి ఏర్పడిందన్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులందరికీ సొంత ఖర్చుతో అత్యంత విలువైన సమాచారంతో కూడిన స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులందరూ మొబైల్స్ ను దూరంగా ఉంచాలని, తల్లితండ్రులు సైతం ఎటువంటి పనులు చెప్పకుండా, పూర్తి సహకారం అందించాలని కోరారు. పదవ తరగతి ఫలితాల పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలని కోరారు. అనంతరం డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఒత్తిడికి గురికాకుండా ఇష్టపడి చదవాలని సూచించడంతోపాటు ఒత్తిడిని అధిగమించే మెలకువలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.