పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి వేడుకలను బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎస్టీల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర అన్ని రంగాల్లో కార్యక్రమాలు అమలుచేస్తూ వారి పురోగతికి బాటలు వేస్తోందని అన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో బంజారాల కోసం బంజారా భవన్ నిర్మించేందుకు స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు ఐదు తాండాలలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, భవాని మాతల దేవాలయాలను సొంత ఖర్చులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో బంజారాల భాగస్వామ్యం పెరగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు బన్సీలాల్, చంద్రశేఖర్, ఎంఈఓ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, చంద్ర శేకర్, గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.