పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ రెండో దశ విస్తరణ చేపడతామన్న కేటీఆర్ ప్రకటనపై పటాన్ చెరులోని రాజన్ సింగ్ నివాసంలో మెట్రో రైల్ సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించి ఆయన ప్రకటన పై అసంతృప్తి వ్యక్తం చేసారు. అతి పెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్ చెరు, పాశమైలారం ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజలు, కార్మికులు నిరంతరం రోడ్డు రవాణా వ్యవస్థ పై ఆధరపడుతూ పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. కార్మికులు, కర్షకుల, ప్రయాణీకుల విలువైన సమయాన్ని వృధా అవుతుందని, ఇంటికి చేరే సమయాన్నీ ఎక్కువ వెచ్చించి జీవితంలో కుటుంబ సభ్యులతో సఖ్యత కోల్పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ విషయాన్ని కార్మికులతో పాటు ఇతర అవసరాలకు ప్రయాణిస్తున్న లక్షలాది మంది ప్రజలు మెట్రోరైల్ సాధన సమితి దృష్టి కి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల అభిష్ఠం మేరకు ప్రభుత్వం, మంత్రి కే.టీ.ఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలిపారు. మెట్రోరైల్ విస్తరణ పనులను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ రాజన్ సింగ్, గోకుల్ ,శ్రీధర్, అబ్దుల్ బాసిత్ ,మెట్టు శ్రీధర్ , కంది శ్రీను, కర్నే శ్రీధర్ ,మహేష్ ,బంటి, చరణ్ తదితరులు పాల్గొన్నారు .