పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని బీటెక్ ( సీఎస్ఈ ) చివరి ఏడాది విద్యార్థి సృష్టి జూపూడిని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ వారు ‘ తెలంగాణ మహిళా లీడర్ అవార్డు’ను ప్రదానం చేశారు . సృష్టి నిబద్ధత , అత్యుత్తమ ప్రదర్శన , సమాజానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నట్టు అవార్డు ఎంపిక కమిటీ ప్రకటించింది . ఆమె మహిళా జాతికే ఆదర్శమని , విశ్వ నాయకి కాదగిన లక్షాలున్నాయని వారు అభిప్రాయపడ్డారు . తరువాతి తరం మహిళలకు ఓ గొప్ప ఉదాహరణ సృష్టి అని , ఆమె భారత యువతకు ఆదర్శమని ప్రశంసా పత్రంలో కమిటీ పేర్కొంది . సృష్టి జూపూడి 17 వ యేటనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ప్రపంచ వేదిక ( 2017 , 18 ప్రపంచ ఛాంపియన్షిప్ ) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది . ఆమె బ్రిక్స్ సీసీఐకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ , హబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా యూత్ అంబాసిడర్గా సేవలందిస్తున్నారు . అతి పిన్న వయస్సులోనే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న సృష్టిని గీతం డెరైక్టర్లు , విభాగాధిపతులు , అధ్యాపకులు , తోటి విద్యార్థులు అభినందించారు .