_మోదీ జీ.. తెలంగాణలో మీ ఆటలు సాగవు..
_టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి పన్నిన కుట్రను నిరసిస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి లు మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఎవరివల్లా సాధ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బిజెపి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రజాస్వామ్యానికి నిలువెత్తు దర్పణమైన భారత దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే దుశ్శాంప్రదాయాన్ని మొదలుపెట్టిన బిజెపికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి కుటిలయత్నాలు చేస్తోందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.