కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదు…

politics Telangana

– గీతం విద్యార్థులతో ముఖాముఖిలో నోవార్టిస్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదని , ఇది వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని , విజయానికి దోహదపడడంతో పాటు జీవనోపాధిని , ఆనందాన్ని అందిస్తుందని హెదరాబాద్ లోని నోవార్టిస్ అసోసియేట్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర వ్యాఖ్యానించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని తొలి ఏడాది బీటెక్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో గురువారం ఆయన ముఖాముఖి నిర్వహించారు . వర్ధమాన ఇంజనీర్లు , మేనేజర్లు కష్టపడి పనిచేయాలి లేదా చదువుకోవాలని , దానిలో రాజీపడొద్దని ఆయన ఉద్బోధించారు . సదాశయంతో కృషిచేయాలని , మార్పు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని హితబోధ చేశారు . తప్పులు చేయడానికి వెరవొద్దని , కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఉత్తమ జీవనానికి బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు . విద్యార్థి దృక్పథంతో పాటు ప్రయత్నాలు కూడా చురుకుగా ఉండాలన్నారు .

జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి , ప్రమాదకరమైన పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడడానికి తగిన స్థితప్రజ్ఞను అలవరచుకోవాలని , అలా చేసినవారే సంపదను సృష్టించగలిగినట్టు ఆయన చెప్పారు . నాలుగు ఉత్తమ లక్షణాలను గురించి సుబాస్ చంద్ర వివరిస్తూ , విభిన్నంగా యోచించగలగాలని , ఏ పనినైనా నిరంతరం పట్టుదలతో చేయాలని , నెమ్మదిగా , జాగరూకతతో కార్యాన్ని సాధించాలన్నారు . మనం చేస్తున్న పనిపై ఇతరులు లేదా శ్రేయోభిలాషుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని , అవసరమైనప్పుడు మన పని విధానాన్ని సవరించుకోవడానికి వెనుకాడకూడదని ఆయన హితవు పలికారు . నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , దానిని జీవితానికి అనుసంధానించాలని సూచించారు .

ఓ పనిలో నెపుణ్యం సాధించడంపైనే దృష్టి సారించాలని , ఎంపిక చేసుకున్న ఆ రంగంలో నిష్ణాతులుగా ఎదగాలన్నారు . ‘ మానవ జీవితంలో నాలుగు స్తంభాలు ‘ ( ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ది హ్యూమన్ లెఫ్ ) పేరిట తాను ఓ పుస్తకాన్ని రచిస్తున్నానని , ఆరోగ్యం , వృత్తి , ఆర్థిక నిర్వహణ , ఇతరులతో సంబంధాలను అందులో ప్రముఖంగా ప్రస్తావించినట్టు సుబాస్ చంద్ర పేర్కొన్నారు . గీతం కెరీర్ డెవలప్మెంట్ సెల్ ని కెరీర్ ఫుల్ ఫిల్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రమాకాంత్ బాల్ అతిథిని సత్కరించగా , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వె.ఎండీ రియాజుద్దీన్ వందన సమర్పణ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *