మనవార్తలు ,హైదరాబాద్:
వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు.అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు ఎం బి బి ఎస్, ఎం డి- డి జి ఓ లాంటి వైద్య విద్య కోర్సులు చేసిన విషయం విదితమే.
