_ప్రజల చెంతకు అత్యాధునిక వైద్య సేవలు
_అందుబాటులో 57 రకాల పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎక్స్ రే, ఈసీజీ
_త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి శంఖుస్థాపన
మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రజల చెంతకే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధి లోని తొమ్మిది ఆస్పత్రుల్లో ఒకే రోజు టి డయాగ్నొస్టిక్ హబ్ సేవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు.
ప్రధానంగా 57 రకాల పరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, ఈ సి జి, ఎక్స్ రే సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 50 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది పీహెచ్సీలు, ఐదు బస్తీ దవాఖానాల లో వైద్యుల సూచనలకు అనుగుణంగా డైగ్నోస్టిక్ హబ్ లో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా త్వరలో పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డైగ్నోస్టిక్ హబ్ లో అత్యుత్తమ సేవలు అందించాలని ఆస్పత్రి అధికారులకు ఎంపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, డీఎంహెచ్వో గాయత్రి దేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధరాదేవి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ఆసుపత్రి సలహా సంఘం సభ్యులు సీనయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు