మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు అమెరికాలోని కుషి బేబీ ఇంక్ నుంచి కన్సల్టెన్సీ ప్రాజెక్టును పొందారు . ఏడాదికి రూ .16.5 లక్షలు ( ప్రయాణ ఖర్చులు అదనం ) వెచ్చించే ఈ ఒప్పందంపై త్వరలో గీతం- కుషి బేబీ ఇంక్ సంతకం చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . రాజస్థాన్ , కర్ణాటక రాష్ట్రాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి మాతా – శిశు ఆరోగ్య సేవలు ప్రతి ఒక్క పౌరుడికీ అందేలా కుషీ బేబీ కృషిచేస్తున్నట్టు తెలియజేశారు . డాక్టర్ నాయుడు తన కన్సల్టెన్సీ సేవలను అనేక రకాల కార్యకలాపాలపై పర్యవేక్షణ , మూల్యాంకనాధికారిగా నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మార్పు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం , పరిశోధన కార్యకలాపాలు అమలు చేయడంలో సలహాలు , విదేశీ పరిశోధనా భాగస్వామ్యాలను ఏర్పరచడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తారని తెలిపారు . అలాగే ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అభివృద్ధి చేయడం , ప్రాజెక్టు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడంలో పరిమాణాత్మక డేటా పర్యవేక్షణ , విశ్లేషణలను నిర్వహిస్తారని , వాస్తవికంగా కీలక పనితీరు సూచికలను ( కేపీఐ ) కూడా అభివృద్ధి చేస్తారని వివరించారు .
గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్టు పొందడం పట్ల డాక్టర్ నాయుడుని అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .