సమయ పాలనే విజయానికి బాట…సుభాష్ కాకర్ల

Districts politics Telangana

మనవార్తలు,పటాన్ చెరు:

సమయ పాలన అంటే , రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుని , సరైన ఫలితాలను సాధించడమని , ఇది అన్ని విజయవంత మైన జీవితాలకు పునాది అని గీతం పూర్వ విద్యార్థి , నిర్వహణా రంగ వృత్తి నిపుణుడు , వక్త , 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తల అవార్డు గ్రహీత సుభాష్ కాకర్ల అన్నారు . గీతం పూర్వ విద్యార్థుల పయనం , వారి అనుభవాలను పంచుకోవడానికి గాను ‘ ట్రెల్ బ్లేజర్స్ ‘ శీర్షికన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లో గురువారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు . ఈ సందర్భంగా సమయ పాలనపై ఓ విద్యార్థి సంధించిన ప్రశ్నకు బదులిస్తూ , ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలే ఉంటాయని , మీరు ఏ విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు , మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎలా పనిచేస్తారు . అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు .

ఇదంతా సాధన ద్వారానే సమకూరుతుందని చెప్పారు . అభిరుచి , వృత్తి నెపుణ్యం , సమయ పాలన , పట్టుదల అనే నాలుగు అంశాలను తాను విశ్వసిస్తానని తెలిపారు . ఓ పనిని ఎంత సమయంలో ముగించాలనే దానిపై స్పష్టత ఉండాలన్నారు . విజయానికి రహస్యం అంటూ ఏదీ లేదని , దానికోసం ఏడడుగులు ఉండవని , అభివృద్ధి వైపు అడుగులేస్తున్న విద్యార్థులంతా నిన్నటి కంటే ఈరోజు కనీసం ఒక శాతమైనా మెరుగ్గా పురోగమించాలని సుభాష్ సూచించారు . ఏదైనా చేయగలననే ధైర్యం ఒక్కసారి వస్తే ఆ వ్యక్తి నాయకుడవుతాడని , కాబట్టి ధైర్యంతో సహజంగా ఏర్పడే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగితే నాయకుడిగా పరిణమించొచ్చని ఓ ప్రశ్నకు బదులిచ్చారు .

కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఆన్లైన్ బోధనలో భౌతిక అనుసంధానం లోపిస్తోందని , దానిని అధిగమించేలా తమని తాము మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు . ఓ బిడియస్తుడిగా గీతమ్ 2013 లో బీటెక్ చేరిన తాను , ఉన్నతాధికారులు , విభాగాధిపతులు , సహాధ్యాయులు , చివరకు అటెండ్ల వరకు ఎంతో పెద్ద కుటుంబాన్ని పొందానని , గీతమే తన ఇల్లుగా సుభాష్ అభివర్ణించారు . ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టాలంటే , ముందుగా మనపై మనకు విశ్వాసం ఉండాలని , ఇతరులపై పెద్దగా ఆధారపడకుండా స్వయం కృషితో దానిని విజయవంతం చేయాలని సలహా ఇచ్చారు . తొలుత , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అతిథిని సత్కరించారు . ఎక్స్టెర్నల్ రిలేషన్స్ డెరైక్టర్ ఆర్కా భట్టాచార్య తన స్వాగతోపన్యాసంలో ఈ ముఖాముఖి లక్ష్యాన్ని వివరించారు . డిప్యూటీ డెరైక్టర్ నవీన్ పినపాత్రుని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *