– అభినందించిన ప్రో వీసీ , ఇతర ఉన్నతాధికారులు
మనవార్తలు ,పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26 న నిర్వహించిన కవాతులో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి అరుణ్ను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ , వివిధ విభాగాధిపతులు మంగళవారం అభినందించారు .
విద్యార్థులు తమ గురించి తాము తెలుసుకోవడానికి , అభివృద్ధి చెందడానికి , వారి నెపుణ్యాలు – జ్ఞానాన్ని వివిధ సందర్భాలలో ఉపయోగించుకోవడానికి ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు సహాయ పడతాయని వారన్నారు . విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించడం ద్వారా లభించే ఇటువంటి అరుదైన అవకాశాలు జీవితంలోనే ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయని వారు అభిప్రాయపడ్డారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగిన నెల రోజుల శిక్షణలో అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . అంతకు మునుపు , గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . అరుణ్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడల్స్ తో పాటు ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు . ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా దినకరన్ సేవలందిస్తున్నారు .