మనవార్తలు , పటాన్ చెరు
నిరుపేదల కోసం నిర్మించిన గృహాలను అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కేటాయిస్తున్నమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు మండలం రామేశ్వరం బండ, అమీన్పూర్ మండలం నర్రే గూడెం గ్రామంలో జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల ద్వారా నిర్మించిన గృహాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో డ్రా నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రా పద్ధతిన రామేశ్వరం బండ గ్రామానికి చెందిన 156 మంది, పటాన్చెరు పట్టణం నుండి 471 మంది, ఆటో యూనియన్ నుండి 79 మంది, రామచంద్రపురం నుండి 20 మంది, అమిన్ పూర్ నుండి 11 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో అవినీతికి తావు లేకుండా అర్హులైన వారికే ఇళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దళారులు ఎవరైనా డబ్బులు ఇస్తే ఇళ్లను అందిస్తామని ప్రలోభ పరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మార్వోలు మైపాల్ రెడ్డి, విజయ్ కుమార్, రామేశ్వరం బండ సర్పంచ్ ధరణి అంతీ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, అఫ్జల్, తదితరులు, పాల్గొన్నారు.