సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు, ఇందుకోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కేటాయించే ప్రతి పైసాను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్, ఘన్ పూర్, పాటి, పోచారం, బచ్చు గూడెం, రామేశ్వరం బండ, ఇంద్రేశం, ఐనోలు, చిన్న కంజర్ల గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నియోజకవర్గానికి ఐదు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాగా, పటాన్చెరు మండలానికి రెండు కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో అవసరమైన చోట సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో లక్ష రూపాయల నిధుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.