అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు , అమీన్పూర్

ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పడే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఛైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధుల ద్వారా సమస్యలను సేకరించి తదనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. రెండేళ్ల కాలంలో 68 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన పాలకవర్గాన్ని అభినందించారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథను విస్తరిస్తున్నామని, ఇందుకోసం భారీ రిజర్వాయర్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అమీన్పూర్ అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమావేశంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *