_మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఇక్రిసాట్ కాలనీ, గ్రీన్ ఫీల్డ్ కాలనీ ల పరిధిలో 99 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ తుమ్మల తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నూతన మున్సిపాలిటీలుగా ఏర్పడిన తెల్లాపూర్, బొల్లారం, అమీన్పూర్ మున్సిపాలిటీలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.


ప్రధానంగా ప్రతి కాలనీలో తాగునీరు, సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్స్ పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
