పసికందును చంపిన తల్లి! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం

Andhra Pradesh Crime

మన వార్తలు , గుంటూరు

పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్న తల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసిం ది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది పాపను పరిశీలించి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు.

మంగళవారం పాప నోటి నుంచి సురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి సమాచారమివ్వగా వైద్యసిబ్బంది. వెళ్లి జీజీహెచుకు రిఫర్ చేశారు. సాయంత్రం మళ్లీ పాపను చూసేందుకు వెళ్లారు. దీంతో పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని తల్లి సమాధానమిచ్చింది. అనుమానమొచ్చిన ఏఎన్ఎం స్వప్న నిలదీయగా తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలు పెట్టి చంపేసినట్టు నేరం అంగీకరించింది. ఈ విషయం కాగితంపై రాసి సంతకం పెట్టిన లక్ష్మి దీని గురించి ఎవరికైనా చెబితే తన చావుకు ఏఎన్ఎం కారణమని పేరు రాసి చస్తానని బెదిరించి నట్టు స్వప్న ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గ్రంధి వెంకటాద్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *