అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజరాపు పూజ 

Crime Districts Hyderabad Telangana

ఖమ్మం

ఖమ్మం  మండలం పెద్దతండాలో ప్రియదర్శిని మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ లో సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆంశలపై అవగాహన పెంపొందించడానికి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా డీసీపీ ఇంజరాపు పూజ, వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పనులు వేగంగా జరుగుతుంటాయని, అయితే దీంతో ఎంత లాభం ఉందో, అంతే నష్టం జరుగుతోందని విద్యార్థులు గ్రహించాలని అన్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని సెల్‌ఫోన్, ఫేస్‌బుక్ వంటి వాటిలో నిక్షిప్తం చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అన్నారు.

వ్యక్తిగత సమాచారం అపరిచిత వ్యక్తులకు, స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పకూడదు. దీనివల్ల అనేక కష్టనష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. ఫోన్ నెంబర్, పిన్‌నెంబర్, ఏటీఎం పాస్‌వర్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వాటిని సెల్‌ఫోన్, ఫెస్‌బుక్‌లలో పెట్టకూడదు. సెల్‌ఫోన్‌లో మన వ్యక్తగత సమాచారం అసలు నమోదు చేసుకోవద్దు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో ఫోన్ నెంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, దీనివల్ల అపరిచిత వ్యక్తులకు మన ఫోన్ నెంబర్ తెలియడం వల్ల ఇతరులకు మన వ్యక్తిగత వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

మన మెయిల్‌కు ప్రతిరోజు అనేక మెసేజ్‌లు వస్తుంటాయి. ఇందులో కొన్ని కంపెనీల పేరుతో, కొన్ని ఇతర వ్యక్తుల పేరుతో వస్తుంటాయి. అయితే మనకు తెలియని మెయిల్స్‌ను ఓపెన్ చేయకూడదు. మనం ఎప్పుడైతే మెయిల్‌పై డబుల్ క్లిక్ చేశామో మన సెల్‌ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. దీనిద్వారా మనం రోజు వారీ చేసే పనులన్నీ ఆయా వ్యక్తులు వీక్షించడం, మన ఫోన్ సంభాషణలు వినడం, మన మెసేజ్‌లను చదవడం ద్వారా మన సమాచారం మొత్తం తెలుసుకునే వీలు కలుగుతుంది. గ్యాలరీలో ఉండే ఫోటోలన్నీ వీక్షించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కూడా ఉందన్నారు.

సైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉండి ఒక్క మన ఫోన్ నెంబర్ ద్వారానే మొత్తం సమాచారాన్ని తెలుసుకుని, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న నగదును కూడా డ్రా చేసుకునే వీలు కలుగుతుంది. కొన్నిసార్లు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఫోన్‌కు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వచ్చింది, మాకు చెప్పండి మీ అకౌంట్ మారుస్తున్నాము, బ్యాంక్‌ను షిప్ట్ చేస్తున్నాము అంటూ అడుగుతారు మన ఓటీపీని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి ఎవరూ ఓటీపీ అడగరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ…సైబర్ నేరగాళ్లకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఓ మార్గమని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంపై దృష్టి సారించిందని, హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 155260 మరియు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ మరియు మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని అమలు చేస్తోందని తెలిపారు.

డయల్ 100 కాల్స్ ను సైబర్ క్రైమ్ విభాగానికి (www.cybercrime.gov.in) కూడా అనుసంధానం చేయడం జరిగిందని, ఇకపై ఆర్థిక సైబర్ మోసానికి గురైన ఎవరైనా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కు / డయల్ 100కు చేయవచ్చు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సంఘటనను నివేదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ, సిఐ తుమ్మ గోపి, సైబర్ సెల్ ఎస్సై రంజిత్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *