చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్

Hyderabad

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్

-1.39 లక్షల సర్కారు ఉద్యోగాలిచ్చాం
– ప్రైవేటు రంగంలో 2.2 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు , 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి
– రైతుబంధు , మిషన్ భగీరథ – కాకతీయ దేశానికే ఆదర్శం – దళితబంధు అమలుచేసి తీరతాం.
– ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ – ఏడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటాం.
– దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ లేకుండా చూడడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాం

హైదరాబాద్:

తమది మాటల ప్రభుత్వం కాదని , చేతల ప్రభుత్వమని , గత ఏడేళ్ళలో చేసిన అభివృద్ధి పథకాలే అందుకు నిదర్శనమని తెలంగాణ మునిసిపల్ , పట్టణాభివృద్ధి , పరిశ్రమలు , ఐటీ అండ్ ఈసీ మంత్రి శ్రీ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు . గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులతో మంగళవారం ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు.

 

 

గీతం అధ్యక్షుడు శ్రీభరత్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , నీళ్ళు , నిధులు , నియామకాల నినాదంతో ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఉద్యమ లక్ష్యం నెరవేరి తెలంగాణ సాకారమయ్యే సమయంలో ఉన్న ఎన్నో సందేహాలను పటాపంచలు చేశామని చెప్పారు . అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుదుత్పాదన లేని తెలంగాణ చీకట్లో మగ్గిపోవలసిందే అని చేసిన వ్యాఖ్య ఎంతో నిరుత్సాహ పరిచినా , దానిని సవాలుగా స్వీకరించి అప్పట్లో 7,780 మెగావాట్లు ఉన్న విద్యుత్ ను 16 వేల మెగావాట్లకు పెంచి నిరంతరాయంగా విద్యుత్ ను పరిశ్రమ , రైతులు , గృహావసరాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు .

తరసరి వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని , గరిష్ఠ డిమాండ్ 12 వేల మెగావాట్లకు చేరినట్టు సభికుల హర్షధ్వానాల మధ్య కేటీఆర్ సగర్వంగా ప్రకటించారు . తాగునీటిని ట్యాంకర్ నుంచి పట్టుకోవడానికి సిఫారసు చేయమని అడిగిన దశ నుంచి మిషన్ భగీరథ పేరిట రమారమి 45 వేల కోట్ల ఖర్చుతో 14 లక్షల కిలోమీటర్ల పైప్ లైను ద్వారా రాష్ట్రంలోని ప్రతి గృహానికి మంచినీరు ఇచ్చే స్థితికి చేరుకున్నట్టు మంత్రి చెప్పారు . నీళ్ళ పైపులు వేయడానికి జరిపిన తవ్వకాలలోనే అత్యాధునిక పైబర్ ఆప్టిక్ లైన్లను కూడా వేసి , వంద ఎంబీపీఎస్ వేగంతో పనిచేసే బ్రాడ్ బ్యాండ్ సేవలు త్వరలో తెలంగాణవాసులకు అందజేయనున్నట్టు తెలిపారు . పూర్తిగా వర్షధారం , చెరువులపై ఆధారపడ్డ తెలంగాణ వ్యవసాయాన్ని గాడిన పెట్టడం కోసం లక్ష కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ అంచెల ఎత్తిపోతల వ్యవస్థతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసి చూపినట్టు కేటీఆర్ చెప్పారు .

అలాగే పాలమూరు – రంగారెడ్డి , డిండి వంటి ఇతరత్రా ప్రాజెక్టులను కూడా అతి త్వరలోనే పూర్తిచేస్తామనే భరోసా ఇచ్చారు . దాదాపు 40 వేల చెరువులతో కళకళలాడిన తెలంగాణ ఆనాటి పాలకుల నిర్లక్ష్యంతో కళతప్పగా , మిషన్ కాకతీయ పేరిట దాదాపు 22 వేల చెరువులను పునరుద్ధరించి రైతుల మోములోచిరునవ్వు నింపామన్నారు . వీటన్నింటి నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను భారత ఆహార సంస్థ , కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు గుర్తించినట్టు చెప్పారు . నేరుగా రైతుల ఖాతాలో జమయ్యేలా రైతుభరోసాను అమలు చేస్తున్నామని , ఈ పథకం అమలు తర్వాత రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు కేసీఆర్ వెల్లడించారు . ఈ పథకాన్ని ఎన్నో రాష్ట్రాలు వివిధ పేర్లతో అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు . అలాగే పలువురి ప్రశ్నలు , సవాళ్ళను ఎదుర్కొంటున్న దళిత భరోసాను కూడా లక్షా 70 వేల కోట్ల బడ్జెట్ తో అమలుచేసి చూపిస్తామని ఆయన చెప్పారు . తెలంగాణ ప్రజల్లో 16 నుంచి 17 శాతం దళితులేనని , తరతరాల వెనుకబాటు తనాన్ని రూపుమాపడం కోసం ఈ యత్నాన్ని తలకెత్తుకున్నామన్నారు . తెలంగాణాలో దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ ఉండకూడదనే లక్ష్యంతో శ్రమిస్తున్నుట్టు కేటీఆర్ చెప్పారు .

 

నిరుద్యోగులందరికీ ఏ ప్రభుత్వమూ ఉద్యోగాలు ఇవ్వజాలదని , ప్రభుత్వ , ప్రైవేటు రంగాల సహకారంతోనే అది సాధ్యపడుతుందని మంత్రి స్పష్టీకరించారు . ప్రభుత్వంలో 1.39 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని , టీఎస్ పాస్ పథకాన్ని నిబద్ధతతో అమలు చేయడం ద్వారా 2.2 లక్షల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించేలా చేశామన్నారు . స్వీయ దరఖాస్తు పేరిట 15 రోజులలోనే పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన అనుమతులన్నీ ఇస్తున్నామని , ఒకవేళ విఫలమైతే 16 రోజుల ఆమోదం పొందినట్టుగా భావించేలా విధాన రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు . ప్రజల నైపుణ్యాలను పెంపొందించి , ఆయా సంస్థలలో ఉద్యోగాలు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నట్టు చెప్పారు .

స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలనే నిబంధనలతో చాలా రాష్ట్రాలు విలువైన పెట్టుబడులను కోల్పోతున్నాయని , తాము స్థానికులకు ప్రాధాన్యం ఇస్తే ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ పారిశ్రామికుల మన్ననలు చూరగొంటున్నామన్నారు . జోనల్ వ్యవస్థను కేంద్రం ఆమోదించడంతో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులు , మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకే దక్కేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు . ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం జరిపి , మంచి చెడులపై నివేదికలు సమర్పించాలని కౌటిల్యా స్కూలు విద్యార్థులకు కేటీఆర్ సూచించారు . వైఫల్యాలకు వెరవకుండా , చేసే పనిపైనే దృష్టి సారించి , లక్ష్యం దిశగా సాగిపోతే విజయవంతం అవుతామని ఆయన చెప్పారు . చేస్తున్నట్టు పనిని కొనసాగిస్తూ ముందుకు సాగిపోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు . ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , కౌటిల్యా డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ , సీఎంవో మనికా రైక్వార్ , పలువురు అధ్యాపకులు , కౌటిల్యా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *