అమీన్పూర్
ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. గురువారం అమీన్పూర్ ఎంపీపీ దేవానందం అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం దరిచేరకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. అనవసర వివాదాల అంశాల్లో తలదూర్చకూడదని సూచించారు.
రాష్ట్రంలో అతి చిన్న మండలంగా ఉన్న అమీన్పూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. మండల పరిషత్ సమావేశంలో చర్చించిన అంశాలను నెలకోసారి తిరిగి చర్చించుకోవాలని సూచించారు. ఎప్పుడు ఎక్కడ సమస్య తలెత్తినా తనను సంప్రదించాలని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను 100% సాధించాలంటే సమన్వయంతో పని చేసినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధులతో పాటు, సీఎస్ఆర్ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వర్, తహసిల్దార్ విజయ్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.