ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని విద్యార్థులకు గీతం నాయకత్వం సూచన
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో సత్కరించారు. ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తేవాలని వారిని ప్రోత్సహించారు. గీతం విశాఖపట్నం ప్రాంగణంలో సెప్టెంబర్ 26-27 తేదీలలో నిర్వహించిన ప్రతిష్టాత్మక డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి మెమోరియల్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో గీతం హైదరాబాదులో విద్యార్థులు సత్తా చాటారు. విజేతలందరినీ గీతం నాయకత్వం సత్కరించి, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.గీతం క్యాంపస్ లైఫ్, క్రీడా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో గీతం విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు ప్రాంగణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 555 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, అలాగే శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యం, స్కిట్లు, సంగీతం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పోటీపడ్డారు. ఆయా పోటీలలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా, వివిధ జాతీయ స్థాయి పోటీలలో గీతం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అత్యుత్తమ విద్యార్థులు, జట్లను ఎంపిక చేశారు.

అథ్లెటిక్స్ లో గీతం హైదరాబాదు విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. పురుషుల జట్టు 200మీ, 1500మీ పరుగు పందాలు, 4×100మీ రిలే, షాట్ పుట్ లో స్వర్ణ పతకాలతో పాటు, 100మీ స్ప్రింట్, షాట్ పుట్, డిస్కస్ త్రోలలో కాంస్య పతకాలతో సహా మొత్తం ఏడు పతకాలను కైవసం చేసుకుంది. మహిళల జట్టు 100మీ, 200మీ, 1500మీ పరుగు పందాలు, 4×100మీ రిలేలలో స్వర్ణ పతకాలతో పాటు స్ప్రింట్, షాట్ పుట్, డిస్కస్ త్రో ఈవెంట్లలో రజత, కాంస్య పతకాలతో సహా పది పతకాలను గెలుచుకుంది.టీమ్ ఈవెంట్లలో (బృందంగా పాల్గొనే పోటీలలో), గీతం పురుషుల, మహిళల జట్లు టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, మిక్స్ డ్ డబుల్స్ పికిల్ బాల్ లలో రజత పతకాలను సాధించాయి.

సాంస్కృతిక కార్యక్రమాలలో, గీతం హైదరాబాదు బృందాలు బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కల్చరల్ ఛాంపియన్ షిప్ లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. వారు తమ అద్భుతమైన ప్రతిభను, పోటీతత్వాన్ని ప్రదర్శిస్తూ, పాశ్యాత్య, శాస్త్రీయ నృత్యాలు, స్కిట్ల పోటీలలో రెండవ స్థానాన్ని కూడా సాధించారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు విజేతలైన విద్యార్థులను, జట్లను పతకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలతో సత్కరించి, వారి విజయాలకు అభినందించారు. రాబోయే పోటీలలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటూ వారిని ప్రోత్సహించారు.
