క్రీడలు, క్యాన్సర్ చికిత్స.. నొప్పి నిర్వహణ కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
క్రీడల సమయంలో తగిలే గాయాలు, క్యాన్సర్ చికిత్సలో ఎదురయ్యే నొప్పి, ప్రమాదాల అనంతరం కలిగే శారీరక ఇబ్బందులకు సరైన చికిత్స, నొప్పి నిర్వహణ ఎంతో ముఖ్యమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు గాయాలకు ప్రత్యేక చికిత్స అందిస్తే వయసు పెరిగినా చురుకుగా ఉండొచ్చని పేర్కొన్నారు.జూబ్లీహిల్స్‌లోని నందిహిల్స్‌లో ‘త్రైవ్ పెయిన్ క్లినిక్ వెల్నెస్ అండ్ మోర్’ను సీవీ ఆనంద్, ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు, కీమోథెరపీ, ప్రమాదాల అనంతరం వచ్చే నొప్పులకు తగిన సమయంలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక వైద్య సేవలు పొందితే శరీరం ఎక్కువకాలం సహకరిస్తుందని చెప్పారు. 60 ఏళ్ల వయసులోనూ చురుకుగా ఉండేందుకు ఆరోగ్యంపై చిన్ననాటి నుంచే శ్రద్ధ పెట్టాలని సూచించారు. క్లినిక్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.త్రైవ్ పెయిన్ క్లినిక్‌ను పెయిన్ మేనేజ్మెంట్ నిపుణుడు డాక్టర్ ధీరజ్‌కుమార్, డాక్టర్ అపరాజిత రేమల్ల, డాక్టర్ స్ఫూర్తి మల్లంపాటి, డాక్టర్ అనహితారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నొప్పి నిర్వహణతో పాటు ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్, కన్జర్వేటివ్ థెరపీలు, అధునాతన పెయిన్ మేనేజ్మెంట్ విధానాలకు సంబంధించిన సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఆహారం.. వ్యాయామం.. ఫిజియోథెరపీ
వయసు పెరిగినా శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవన విధానంలో వెల్నెస్, సమతుల ఆహారం, సరైన డైట్, ఫిజియోథెరపీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచించారు. నొప్పిని భరించడంతో కంటే దానికి సరైన కారణాన్ని గుర్తించి తగిన సమయంలో చికిత్స పొందడం అవసరమని తెలిపారు.
