ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్–2026

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

దేశవ్యాప్తంగా అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం వాటా అందిస్తూ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ గా ఘనత సాధించింద‌ని ఇక్రిశాట్ డీజీ హిమాన్షు పాఠ‌క్ తెలిపారు. హైద‌రాబాద్ ఇక్రిశాట్ లో అసోచామ్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను మాజీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సునీల్ శ‌ర్మ‌తో క‌లిసి ప్రారంభించారు . దేశానికి అవసరమైన ప్రతి 10 విత్తనాలలో 6 తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయ‌న్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించింద‌న్నారు . వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌ల‌లో సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంతో పాటు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని, అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనాల సరఫరా ఎంతో కీలకమని అన్నారు.హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ ప్రపంచస్థాయి విత్తన పరిశోధన, తయారీ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ విత్తన ఉత్పత్తి కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాయని, ఎంఎస్ఎంఈ ద్వారా కూడా రైతులకు విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు శిక్షణ కల్పిస్తే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, సీడ్స్ రంగంపై గ్రామీణ యువతకు అవగాహన పెంచితే వారి భవిష్యత్తు మరింత మెరుగవుతుందని చెప్పారు. 2047 నాటికి భారతదేశం వ్యవసాయం, సీడ్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సునీల్ శర్మ, విత్తన ఉత్పత్తులు, పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ కార్య‌క్ర‌మంలో అసోచాం ఏపీ ,తెలంగాణ ఛైర్ వెంక‌ట‌రామ్ వ‌సంత‌వాడ‌, ఐసీఏఆర్ మాజీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ విలాస్ ,కావేరి యూనివ‌ర్సిటీ వీసీ ప్రవీణ్ రావు , అసోచాం డిప్యూటీ సెక్ర‌ట‌రీ జ‌న‌రల్ డీఎస్ రాజోరతో మరియు 20 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *