మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి అహ్మద్ మిన్హాజుద్దీన్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సిమెంటు, సూక్ష్మ కంకరకు పాక్షిక ప్రత్యామ్నాయాలుగా వ్యవసాయ-పారిశ్రామిక వ్యర్థాలను చేర్చిన సుస్థిర కాంక్రీటుపై ఒక అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరిజిత్ సాహా శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ అహ్మద్ మిన్హాజుద్దీన్ అధ్యయనం, కాంక్రీటులో శుద్ధి చేయని చెరకు పిప్పి బూడిద (Ut-SCBA), వ్యర్థ గ్రానైట్ పొడి (WGP) వినియోగాన్ని అన్వేషించడం ద్వారా పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ యొక్క తీవ్రమైన సవాలును పరిష్కరిస్తుందని తెలిపారు.
ఈ పరిశోధన ఎం25 గ్రేడ్ కాంక్రీట్ లో సిమెంటు, ఫైన్ అగ్రిగేటుకు పాక్షిక ప్రత్యామ్నాయాలుగా వాటి ప్రభావాన్ని సమగ్ర యాంత్రిక, మన్నిక, సూక్ష్మ నిర్మాణ విశ్లేషణల ద్వారా మూల్యాంకనం చేస్తుందన్నారు.ఈ పరిశోధన ఫలితాలు 15 శాతం Ut-SCBA, 30 WGPల ఉత్తమ మిశ్రమాన్ని గుర్తించాయని తెలిపారు. ఇది మెరుగైన బలం, మన్నిక, పర్యావరణ హితంగా ఉంటుందన్నారు. ఈ అధ్యయనం, డంపింగ్ యార్డుల భారాన్ని తగ్గించి, సహజ వనరులను పరిరక్షించే ఒక ఆచరణీయమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని వెలుగులోకి తెస్తోందని వివరించారు.
డాక్టర్ అహ్మద్ మిన్హాజుద్దీన్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రమేష్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్ చేకూరి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
