వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి వియత్నాంలోని హోచిమిన్ నగరంలో అంతర్జాతీయ విద్యా శిక్షణ కోసం వెళ్లారు. ఆయన నవంబర్ 10 నుంచి 22 వరకు వియెన్ డాంగ్ కళాశాలలో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) బిల్డర్ బ్యూట్ క్యాంప్ – చేయడం ద్వారా నేర్చుకోండి, ఆలోచించడం ద్వారా నిర్మించండి’ అనే ఆచరణాత్మక కార్యశాలను నిర్వహిస్తున్నారు.రెండు వారాల ఈ వర్క్ షాపులో చురుకైన అభ్యాసం ద్వారా విద్యార్థులను చైతన్యపరచడానికి, ప్రయోగాలు చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సిద్ధాంతాని (థియరీ)కి మించి నేర్చుకోవడానికి ఆయన సాయపడతున్నారు.
కోడ్, సృజనాత్మకత ద్వారా తమ ఆలోచనలు ఎలా సజీవంగా వస్తాయో యువకులు గ్రహించినప్పుడు, వారిలో వెలుగును చూడడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని డాక్టర్ నిరంజన్ అన్నారు.‘నిజమైన అభ్యాసం అనేది ఉత్సుకత, ధైర్యంతో కలిసినప్పుడు జరుగుతుంది. ప్రయత్నించడానికి, విఫలమవడానికి, మళ్లీ నేర్చుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. వియత్నాంలో నేను చూసిన ఉత్సాహం, వాతావరణం ఆ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని డాక్టర్ నిరంజన్ వ్యాఖ్యానించారు.వియెన్ డాంగ్ కళాశాల ఆతిథ్యం, సహకారానికి ఆయన కృతజ్జతలు తెలుపుతూ, అర్థవంతమైన మార్పు కోసం, తదుపరి తరం ఏఐ ఆవిష్కర్తలను పెంపొందించడానికి ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
దాదాపు 26 ఏళ్ల బోధనానుభవంతో, డాక్టర్ నిరంజన్ గతంలో వియెన్ డాంగ్ కళాశాలలో జావా, ప్లట్టర్ లలో ఆచరణాత్మక శిక్షణతో పాటు కృత్రిమ మేధస్సుపై ఆతిథ్య ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యా భాగస్వామ్యాలను పెంపొందించడంలో, విద్యార్థుల నైపుణ్యాలను పెంచడంలో ఆయన నిరంతర ప్రయత్నాలు వియత్నాం విద్యా వ్యవస్థపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయనడంలో అతిశయోక్తి లేదు.అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన, ప్రపంచ అభ్యాస కార్యక్రమాలలో డాక్టర్ నిరంజన్ చురుకుగా పాల్గొనడం వల్ల గీతం ఖ్యాతి పెరగడమే కాకుండా, సరిహద్దులకు అతీతంగా ఆవిష్కరణ, సహకార స్ఫూర్తిని కూడా బలోపేతం చేస్తుంది.
