సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

Telangana

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ హబ్ గా మారే దిశగా క్రమంగా పురోగమిస్తోందని ఐఐటీ భువనేశ్వర్ లోని ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.విజయ శంకర్ ఆశాభావం వ్యక్తపరిచారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధస్సు/మెషీన్ లెర్నింగ్- 5జీ నుంచి 6జీకి నడిచే కమ్యూనికేషన్, అనుసంధానించిన ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాలను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ విజయ శంకర్ మాట్లాడుతూ, 28 నుంచి 22 నానోమీటర్ల వంటి అధునాతన నోడ్ లలో కొత్త సౌకర్యాలు వస్తున్నందున, భారతదేశ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘2028 నాటికి మన మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు శక్తినిచ్చే స్వదేశీ తయారీ చిప్ లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను కలిగి ఉంటామని ఆశిస్తున్నాం.

టాటా ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమ బలమైన భాగస్వామ్యంతో, భారతదేశం ప్రపంచ సరఫరా గొలుసు (సప్లయ్ చైన్)లో కీలక పాత్ర పోషించనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ కృత్రిమ మేధస్సు, సమాచార, వైద్య, ఉపగ్రహ, రక్షణ రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. బలమైన తయారీ సౌకర్యాలు నెలకొల్పాక, భారతదేశం వికసిత్, ఆత్మనిర్బర్ భారత్ (అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశం)గా మారే దిశగా ముందుకు సాగుతోందన్నారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఛార్జ్ డైరెక్టర్, ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. మంజునాథాచారి గీతంలోని కమ్యూనికేషన్ టెక్నాలజీ, పరిశోధన మౌలిక సదుపాయాలను వివరించారు.

అధునాతన ప్రయోగశాలలు, లైసెన్సు పొంది సాంకేతికతను గీతం వినియోగిస్తోందని, ఆయా సదుపాయాలను వివిధ వర్సిటీల నుంచి వచ్చిన విద్యావేత్తలంతా సందర్శించి, తగు సూచనలు చేయాలని విజ్జప్తి చేశారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి, 5జీ, 6జీలో తాజా పరిణామాలను సమగ్రంగా పరిశీలించమని సదస్యులను ప్రోత్సహించారు. ఏఐ/ఎంఎల్ తదుపరి తరం కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడానికి విద్యావేత్తలు, పరిశ్రమలను ఒకచోట చేర్చడమే ఈ కార్యశాల లక్ష్యమని కన్వీనర్ డాక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్ అన్నారు.ఈ రెండు రోజుల వర్క్ షాపులో ఐఐటీలు, ఇస్రో, డీఆర్ డీవో, ఇతర సంస్థల నుంచి ప్రముఖ వక్తలు నైపుణ్యోపన్యాలు చేయనున్నారు. డాక్టర్ ఇ.అరుణ్ జ్యోతి వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *