పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన 2 కి.మీ. రన్ ను శుక్రవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఐక్యతకు ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర్యానంతరం అనేక దేశీయ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు సీఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, వివిధ సంఘాల అధ్యక్షులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పట్టణ పుర ప్రముఖులు, విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 
	 
						 
						