-చిట్కుల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
-సర్వేపల్లి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నీలం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లితో పాటు సావిత్రి బాయి పూలే, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యనే పునాది అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే విద్యార్థిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలరో తెలుసుకుని ఆచరించిన ఆ మహాపురుషుడు జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి తత్వ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఘనత ఆయన సొంతమన్నారు. మహనీయులు సర్వేపల్లి, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.