సార్వత్రిక మానవ విలువలపై
గీతంలో స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన గౌతమ్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థులు విలువలకు పెద్దపీట వేసి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సీఐఐ తెలంగాణ ఉపాధ్యక్షుడు, రీ-సస్టైనబిలిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి హితబోధ చేశారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని తొలి ఏడాది బీటెక్ విద్యార్థులను ఉద్దేశించిన మంగళవారం ఆయన సార్వత్రిక మానవ విలువలపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.మానవ విలువల యొక్క నాలుగు ప్రధాన స్తంభాలు- నైతిక, సామాజిక, వ్యక్తిగత, ఆధ్యాత్మికలతో కూడిన బాధ్యతాయుతమైన, దయగల వ్యక్తులను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను గౌతమ్ వివరించారు. నిజాయితీ, సమగ్రత, న్యాయబద్ధత, జవాబుదారీతనం వంటి నైతిక విలువలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు.గౌరవం, సానుభూతి, సహకారం, సహనం వంటి సామాజిక విలువలు సామరస్యపూర్వక జీవనానికి అవసరమన్నారు.వ్యక్తిగత వృద్ధి, ఆత్మగౌరవం, ఆశయం, పట్టుదల వంటి వ్యక్తిగత విలువలను ఆచరించాలని సూచించారు.
కరుణ, క్షమ, వినయం, మానవత్వం, సానుభూతి వంటి మతంతో సంబంధంలేని ఆధ్యాత్మిక విలువలు వినయాన్ని పెంపొందిస్తాయని గౌతమ్ రెడ్డి చెప్పారు.స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీలు) మద్దతు ఇవ్వాలని గీతం బీటెక్ విద్యార్థులకు గౌతమ్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మనకు అందుబాటులో ఉన్న వనరులను అవసరమైన మేరకు ధర్మబద్ధంగా, భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వినియోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఆహారాన్ని అవసరమైన మేరకు తృప్తిగా భుజించాలని, ఎట్టి పరిస్థితులలోనూ వృధా చేయకూడదన్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించాలని ఆయన కోరారు.
బీటెక్ విద్యార్థులు గీతంలో గడిపే నాలుగేళ్లూ పరివర్తన కలిగించే కాలం అవుతుందని, వ్యక్తిగత సంతృప్తిని సాధించడానికి, సమాజానికి సానుకూలంగా దోహదపడటానికి ఈ విలువలకు అనుగుణంగా జీవించాలని గౌతమ్ రెడ్డి సూచించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి అతిథిని సత్కరించి, స్వాగతించగా, ఈ కార్యక్రమాన్ని బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి. త్రినాథరావు సమన్వయం చేశారు.