ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి గుర్తింపు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు వర్ధమాన పరిశోధకురాలు జంగపల్లి వర్ష, ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ గుర్తింపు అయిన ఐవీఐ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీని అందుకున్నారు. ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్.వీ. ప్రసాద్ నైత్ర వైద్యశాల (ఎల్వీపీఈఐ) సహకారంతో గీతం ఆప్టోమెట్రీ కోర్సును నిర్వహిస్తున్న విషయం విదితమే.
భారతదేశంలో కంటి సంరక్షణను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ప్రముఖ లాభాపేక్ష లేని సంస్థ ఇండియా విజన్ ఇన్ స్టిట్యూట్ (ఐవీఐ) ఈ అవార్డును ప్రకటించింది. యువ దృష్టి శాస్త్ర నిపుణులలో బలమైన పరిశోధన సంస్కృతిని పెంపొందించాలనే ఐవీఐ లక్ష్యాన్ని బ్రియన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీ ప్రతిబింబిస్తుందని ఐవీఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్ డేనియల్ అన్నారు. విద్యార్థుల కెరీర్ ప్రారంభంలోనే అసలైన, ప్రతిభావంతమైన పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా, మనదేశం యొక్క పెరుగుతున్న కంటి సంరక్షణ డిమాండ్లను తీర్చగల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆప్టోమెట్రీ రంగాన్ని రూపొందించాలని తాము ఆశిస్తున్నామన్నారు.జంగపల్లి వర్ష సాధించిన విజయాన్ని గీతం, ఎల్వీపీఈఐ సీనియర్ నాయకత్వం ప్రశంసించింది. గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు; రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ; స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజా; ఎల్వీపీఈఐ శాస్త్రవేత్త-నెట్ వర్క్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ ఆర్. భరద్వాజ్; రిజిస్ట్రార్ విజయ్ కుమార్; గీతంలో నిర్వహిస్తున్న ఆప్టోమెట్రీ కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ టి.విశ్వం తదితరులు వర్షను అభినందించారు.ఎల్వీపీఈఐ భాగస్వామ్యంతో గీతం, ఆప్టోమెట్రీ, దృష్టి శాస్త్రాల రంగంలో విద్యా నైపుణ్యం, ఆవిష్కరణలను పెంపొందిస్తూనే ఉందన్నారు. అత్యాధునిక పరిశోధన, వాస్తవ ప్రపంచ ప్రభావం ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను ఈ విజయం మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.