సొంత నిధులతో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, మహిళల విద్య కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.భవిష్యత్తు తరాలకు వారి ఆశయాలను అందించాలన్న సమన్నత లక్ష్యంతో సొంత నిధులచే పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని.. పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 18వ శతాబ్దంలో సమాజంలో అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. దేశంలో మహిళా విద్యకు బాధ్యురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, కొమరగూడెం వెంకటేష్, నరసింహారెడ్డి, రుద్రారం శంకర్, పృథ్వీరాజ్, అశోక్, ప్రకాష్ రావు, నర్రా బిక్షపతి, శంకర్, కుమార్, నీవర్తిదేవ్, చంద్రశేఖర్, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
