పేలుడు పదార్థాలు, పేల్చే పద్ధతులపై అవగాహన

Telangana

రెండు రోజుల సాంకేతికత మార్పిడి కార్యక్రమంలో వక్తలుగా పరిశ్రమ-విద్యా నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘గనులు-క్వారీ పరిశ్రమ కోసం మౌలిక సదుపాయాలు, పేలుడు పదార్థాలు, పేల్చే పద్ధతుల’పై మే 9-10 తేదీలలో రెండు రోజుల సాంకేతికత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పేలుడు సాంకేతికతలో పురోగతులు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడానికి పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ప్రాజెక్టు మేనేజర్లు, బ్లాస్టింగ్ ఇంజనీర్లు, నియంత్రణ సంస్థలు, అమలు చేసే ఏజెన్సీలు, తవ్వకం కాంట్రాక్టర్లు, పేలుడు పదార్థాల తయారీదారులు, ఇన్ స్ట్రుమెంటేషన్ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు తదితరులు జ్జానాన్ని మార్పిడి చేసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి, భారతీయ పరిశ్రమలో బ్లాస్టింగ్ టెక్నిక్ లను మెరుగుపరచడంపై వ్యూహరచన చేయడానికి ఒక ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం తోడ్పడనుందన్నారు.

బ్లాస్ట్ డిజైన్, ఫలితాలలో భూగర్భ శాస్త్రం పాత్ర; పేలుడు పదార్థాలు, ప్రారంభ పరికరాలలో పురోగతి; ఉపరితరం-భూగర్శ తవ్వకాల కోసం బ్లాస్ట్ డిజైన్; బ్లాస్ట్ ఫలితాల అంచనా; బ్లాస్టింగ్-ఉపశమన వ్యూహాల యొక్క పర్యావరణ ప్రభావాలు; బ్లాస్ట్ నష్టం- ముందస్తు అంచనా-నియంత్రణ చర్యలు; నీటి కింద బ్లాస్టింగ్ టెక్నాలజీ; పట్టణ వాతావరణంలో బ్లాస్టింగ్ పద్ధతులు అనే అంశాలపై ఈ నిపుణుల మార్గదర్శనం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నిపుణులు రిసోర్స్ పర్సన్లుగా పాల్గొంటారని, వారిలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వేదాల రామ శాస్త్రి; బెంగళూరులోని జాతీయ రాక్ మెకానిక్స్ సంస్థ పూర్వ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. వెంకటేష్; ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు; వారణాసిలోని ఐఐటీ-బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంజయ్ శర్మ; నాగపూర్ లోని సీఎస్ఐఆర్-మైనింగ్-ఇంధన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రాములు; నాగపూర్ విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎన్.ఆర్. థోటే తదితరులు పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం గనులు, క్వారీ పరిశ్రమలలో అత్యాధునిక పరిణామాలపై లోతైన అవగాహన పొందడానికి, బ్లాస్టింగ్ టెక్నాలజీ ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఒక విలువైన అవకాశంగా అభివర్ణించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, ఇతర వివరాల కోసం డాక్టర్ జి. జ్యోతికుమారిని 97019 28209ను సంప్రదించాలని, jganta@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా వెబ్ లింక్ https://forms.gle/ bcdoyFpJfNLLgj9G6. ను సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *