పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని కళలు, ప్రదర్శనా కళల విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆదిశేషయ్య సాడే లలిత కళలలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్ డీ) పట్టా పొందారు. పంజాబ్, పగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్ పీయూ) దీనిని ప్రదానం చేసింది.‘జానపద మూలాంశాలు: ఆంధ్రప్రదేశ్ లో తోలుబొమ్మలాట కళారూపాల అభివ్యక్తి’ అనే శీర్షికతో ఆయన చేసిన సంచలనాత్మక పరిశోధన, ఎల్ పీయూలోని లలిత కళల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వేశ్వరి తివారీ మార్గదర్శనంలో జరిగింది.తోలు బొమ్మల కళ గొప్ప వారసత్వం సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషించడానికి ఆదిశేషయ్య తన పరిశోధనను అంకితం చేశారు. ఈ సాంప్రదాయ కళను నిర్వచించే సంక్లిష్టమైన జానపద మూలాంశాలు, స్పష్టమైన కథ చెప్పే సంప్రదాయాలు, ప్రతీకాత్కక కళాత్మకతను ఆయన అధ్యయనం పరిశీలించి, దాని చారిత్రక ఔచిత్యం, కళాత్మక పరిణామంపై తాజా దృక్కోణాలను అందిస్తోంది.ఆదిశేషయ్య పీహెచ్.డీ. పట్టాను సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ సన్నీ జోస్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించి, లలిత కళల రంగానికి ఆదిశేషయ్య చేసిన సేవలను వారు ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.