క్రమశిక్షణ, పట్టుదలను ఎన్ సీసీ పెంపొందిస్తుంది

Telangana

వీడ్కోలు సమావేశంలో జూనియర్లకు ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతల ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్ సీసీ) అంటే కేవలం శిబిరాలు, పతకాల కంటే ఎక్కువని, ఇది క్రమశిక్షణ, పట్టుదల, గౌరవం యొక్క విలువలను పెంపొందిస్తుందని ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతలైన సీనియర్లు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల ఎన్ సీసీ శిక్షణ పూర్తిచేసుకుని, ‘సీ’ సర్టిఫికెట్లు సాధించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులకు జూనియర్లు బుధవారం చిరస్మరణీయమైన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ల అంకితభావం, విజయాలను మననం చేసుకుని, వారిని సగౌరవంగా సాగనంపడానికి దీనిని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, భావోద్వేగ ప్రసంగాలు, ప్రియమైన జ్జాపకాలను నిక్షిప్తంచేసి ప్రదర్శించిన వీడియో అందరినీ ఆకట్టుకున్నాయి. ‘ఇది వీడ్కోలు కాదు. మీరు చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. విజయం ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తుంది, మీ వారసత్వం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అనే సందేశంతో ఆ వీడియో ప్రదర్శన ముగిసింది.

తొలుత, జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైన ఈ వీడ్కోలు హృదయపూర్వక ప్రసంగాలు, నృత్యాలు, పాటలతో ఉర్రూతలూగించింది. ప్రతి అంశం క్యాడెట్ల అచంచలమైన అంకితభావం, క్రమశిక్షణ, ప్రతిభను చాటి చెప్పింది. గీతంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బయటకు వెళ్లే క్యాడెట్లకు మథుర జ్జాపకంగా నిలిచిపోయింది.‘ఇది కేవలం వీడ్కోలు కాదు, మీ కృషి, విజయాలు, మీరు అందించిన అమూల్యమైన వారసత్వానికి నివాళి. గణతంత్ర దినోత్సవ క్యాంపు (ఆర్డీసీ), యువత మార్పిడి కార్యక్రమం (వైఎల్పీ) ఐడీఎస్ఎస్ క్యాంపు, ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఎస్ఎస్ బీ శిక్షణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో గీతంకు ప్రాతినిధ్యం వహించారు. అంకితభావం, క్రమశిక్షణ ద్వారా విజయం సాధించవచ్చని మీరు మాకు చూపించారు. మీ వారసత్వం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని జూనియర్ విద్యార్థులు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ వీడ్కోలు తమ నిబద్ధత, దృఢ సంకల్పం, త్యాగాలకు నిదర్శనమని, తమ సానుకూల వాతావరణాన్ని దాటి ముందుకు నడిపించిన పరివర్తనాత్మక ప్రయాణంగా ఎన్ సీసీని గురించి సీనియర్ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. బాధ్యత, నాయకత్వం, స్థితిస్థాపకతలను తమకు నేర్పిందని చెప్పారు. ఇది కేవలం శిబిరాలు, పతకాల కంటే క్రమశిక్షణ, పట్టుదల, గౌరవం యొక్క విలువలను పెంపొందించిందన్నారు. ఈ విలువలను స్వీకరించి, బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ వెనకాడవద్దని జూనియర్లకు వారు ఉద్బోధించారు.ఈ వేడుక ఎన్ సీసీ క్యాడెట్ ప్రయాణాన్ని నిర్వచించే అంకితభావం, బాధ్యత యొక్క శక్తివంతమైన జ్జాపకంగా నిలిచి, అందులో పాల్గొన్న వారందరిపై శాశ్వత ముద్ర వేసింది.గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, క్రీడల డిప్యూటీ డైరెక్టర్ ఎం.నారాయణరావు చౌదరి, ఎన్ సీసీ కేర్ టేకింగ్ ఆఫీసర్ అజయ్ తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *