సరళమైన భాషలో యోచిస్తే ఉత్తమ పరిష్కారాలు

Telangana

గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమం, సైన్స్ దినోత్సవ వేడుకల్లో పేర్కొన్న డాక్టర్ కృష్ణ ఎల్లా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సరళమైన భాషలో సైన్స్ గురించి ఆలోచిస్తే, ప్రపంచానికి ఉత్తమ పరిష్కారాలను కనుగొంటారని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, వ్యవస్థాపకుడు, వ్యాక్సిన్ ఆవిష్కర్త డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. వ్యవసాయ కుటుంబంలో తన పెంపకాన్ని గుర్తుచేసుకుంటూ, డాక్టర్ ఎల్లా శాస్త్రీయ విచారణలో సరళత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, గీతం ఛేంజ్ మేకర్స్ సిరీస్ లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎల్లా సైన్స్, వ్యవస్థాపకతలో తన అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. తన లోతైన అవగాహన, అనుభవాల ద్వారా గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల్లోని పది ప్రముఖ కళాశాలల నుంచి వచ్చిన 550 మందితో పాటు, పరిశోధకులకు కూడా స్ఫూర్తినిచ్చారు.డాక్టర్ ఎల్లా భారత్ బయోటెక్ ను స్థాపించడం నుంచి కోవాక్సిన్, టైప్బార్ టీసీవీ, రోటావాక్ వంటి సంచలనాత్మక వ్యాక్సిన్ ల అభివృద్ధి వరకు తన ప్రయాణాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేయడంతో పాటు, అనువాద పరిశోధనకు ఆయన చేసిన కృషి ప్రపంచ ఆరోగ్య సంరక్షణను మార్చడంతో పాటు లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఊహ, ఆచరణాత్మకతకు విలువనిచ్చే ఆవిష్కరణ సంస్కృతిని సమర్థిస్తూ, యువ మనస్సులు తమ పరిసరాలను గమనించి ప్రశ్నలు అడగాలని డాక్టర్ ఎల్లా ప్రోత్సహించారు. ‘ప్రపంచం చాలా విభజించబడింది, ఆ అంతరాన్ని తగ్గించడానికి ఆవిష్కరణ కీలకం. భారతదేశం 12 నుంచి 15 శాతం జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిని కోరుకుంటే, ఆవిష్కరణ మాత్రమే సాధ్యం’ అని ఎల్లా స్పష్టీకరించారు. భారతదేశంలో ప్రస్తుత ఆవిష్కరణ స్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, అందుబాటులో ఉన్న శాస్త్రీయ జ్జాన సంపదను గుర్తించాలని, సైన్స్ యొక్క ప్రాథమిక సూత్రాలను స్వీకరించాలని భావి పౌరులను కోరారు.కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన భారత్ బయోటెక్ ప్రయాణం, ప్రస్తుతం ఐదు ప్రదేశాలలో నాలుగు వేల మంది బృందానికి ఎదిగిందన్నారు. జీవితంలో అంతర్భాగంగా క్లినికల్ పరిశోధన యొక్క ప్రాముఖ్యతను, సమస్య పరిష్కారం వైపు దృక్పథంలో మార్పు యొక్క అవసరాన్ని డాక్టర్ ఎల్లా ఎత్తి చూపారు.

ముందుగా, ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మతుకుమిల్లి, గీతం ఛాన్స్ లర్ డాక్టర్ వీరందర్ సింగ్ చౌహాన్ డాక్టర్ ఎల్లాను సత్కరించారు. ఐఐసీటీ పూర్వ డైరెక్టర్, గీతం విశిష్ట ఆచార్యుడు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అతిథిని పరిచయం చేయడంతో పాటు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

తొలుత, గీతం హైదరాబాద్ లో నెలకొల్పిన మల్టీడిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ (MURTI)ని డాక్టర్ ఎల్లా ప్రారంభించారు. ఈ అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడం, ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. శాస్త్రీయ ఆవిష్కరణలో ఆచరణాత్మక అనువర్తనాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పరిశ్రమ అవసరాలతో వారి ప్రాథమిక పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టాలంటూ డాక్టర్ ఎల్లా గీతం పరిశోధకులను ప్రోత్సహించారు.గీతంను ఎంఐటీ వంటి ప్రఖ్యాత సంస్థలతో పోల్చిన డాక్టర్ ఎల్లా, గీతం వ్యవస్థాపకుల దార్శినిక నాయకత్వానికి గాను, డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి, ఆయన మనవడు ఎం.శ్రీభరత్ లకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *