ఆలోచింపజేసిన దేశ, విదేశీ నిపుణుల ప్రసంగాలు
భవిష్య సవాళ్లపై లోతైన అవగాహన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాదులో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ‘ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్రాలలో సమగ్ర ధోరణులు’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగియడమే గాక, ప్రపంచ ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో చెరగని ముద్ర వేసింది.డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ వెంకటేశ్వర్లు, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సీవో) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎ.రామ్ కిషన్ తదితరులు ఈ సదస్సును ప్రారంభించారు. వారి స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులను ఒకచోట చేర్చిన వేదికగా నిలిచాయి.మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఔషధ, ఆరోగ్య శాస్త్రాల అభివృద్ధి చెందుతున్న అంశంపై లోతైన అవగాహన అందించిన ప్రముఖ వక్తలకు ఆతిథ్యం ఇచ్చింది. తొలిరోజు డాక్టర్ రెడ్డీస్ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరిమళ్ మిశ్రా, నైపర్ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు వినోద్ కుమార్, రాజ్ కుమార్, క్రొయేషియాలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త డాక్టర్ జురికా నోవాక్ ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు. రెండు రోజు కూడా ఇదే ఒరవడి కొనసాగింది.
మలేషియాలోని ఐఎంయూ వర్సిటీకి చెందిన డాక్టర్ త్యాగరాజన్ మాధేశ్వరన్, బిట్స్ పిలానీకి చెందిన ప్రొఫెసర్ అనిల్ కుమార్, అమెరికాలోని చాప్ మన్ వర్సిటీ ప్రొఫెసర్ కెపరాంగ్, శ్రీలంకలోని వాయంబా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ ఎస్.జీవతయపరన్, కాలిఫోర్నియాలోని సైట్ఎక్స్ థెరప్యూటిక్స్ నుంచి డాక్టర్ రాఘవ శ్రీరమణేని నేతృత్వంలో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఇక చివరి రోజున, ఈ సదస్సు ఐఈఎఫ్ఆర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఉదయ్ సక్సేనా, ఎన్వేద థెరప్యూటిక్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీకాంత్ రామచంద్రన్, దక్షిణ కొరియా నుంచి ప్రొఫెసర్ గంగరాజు గెడ్డా, పూణే నుంచి ప్రొఫెసర్ చిన్నోయ్ పాత్రా వంటి ప్రఖ్యాత నిపుణులు ఆరోగ్య సంరక్షణ, ఔషధ ఆవిష్కరణల భవిష్యత్తుపై అద్భుతమైన అంతర్దృష్టులను పంచుకున్నారు.
ఈ సదస్సు నిర్వాహకుడు డాక్టర్ ప్రతీక్ పాఠక్ మాట్లాడుతూ, ఇందులో 60కి పైగా మౌఖిక ప్రదర్శనలు, వందకు పైగా పోస్టర్ ప్రదర్శనలు, 15 మంది నిపుణుల ఉపన్యాసాలు జరిగినట్టు తెలిపారు. విద్యా, శాస్త్రీయ అంశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించామన్నారు. ప్రపంచ జ్జాన సమ్మేళనంగా నిలిచిన ఈ సదస్సులో అమెరికా, క్రోయేషియా, మలేషియా, శ్రీలంక, దక్షిణ కొరియా, భారతదేశం నుంచి విభిన్న శ్రేణి వక్తలు పాల్గొన్నారని డాక్టర్ ప్రతీక్ తెలిపారు. మూడు వేర్వేరు దేశాలతో పాటు మనదేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి 450 మంది హాజరైన ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ, ఔషధ పురోగతిపై సార్వత్రిక ఔచిత్యాన్ని, పెరుగుతున్న ఆసక్తిని నొక్కి చెప్పిందన్నారు.
ఈ అంతర్జాతీయ సహకారం గొప్ప చర్చలు, కొత్త ఆలోచనలు, పరిశ్రమ యొక్క భవిష్యత్తును రూపొందించే సవాళ్లు, అవకాశాల గురించి లోతైన అవగాహనను పెంపొందించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, జ్జానాన్ని పంచుకోవడానికి, ఆలోచనల మార్పిడికి, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించే సహకారాలను పెంపొందించడానికి ఒక పరివర్తన వేదికగా తోడ్పడినట్టు ప్రతీక్ వివరించారు. ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు. చివరిగా, ఓరల్, పోస్టర్ ప్రజెంటేషన్ విజేతలకు బహుతులు, వారిని ఎంపిక చేసిన ప్యానల్ కు జ్జాపికలను అందజేసి సత్కరించారు.