గీతంలో ఉత్సాహభరితంగా సంక్రాంతి సంబరాలు

Telangana

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు, ఎద్దుల బండి, చెరకు రసం, సంప్రదాయ అరిటాకు భోజనం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో శుక్రవారం వార్షిక పంటల పండుగ అయిన మకర సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహభరితంగా, ఆనందంగా నిర్వహించారు. గీతంలోని ఆతిథ్య విభాగం, స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ, విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలితీయడం లక్ష్యంగా సాగింది.
ఉత్సాహభరితమైన అలంకరణలు, సాంప్రదాయ ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆనంద క్షణాలను అనుభవించే వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు రంగు రంగుల సంప్రదాయ దుస్తులతో తరలి రావడంతో ప్రాంగణమంతా వర్ణశోభితమైంది. మన సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా, విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యాలకు వెలికితీసే వేదికగా కూడా ఈ వేడుకలు ఉపకరించాయి.ముగ్గుల (రంగోలి) పోటీ, ఎద్దుల బండి, సహజ పద్ధతిలో చెరుకు రసం వెలికితీసే పరికరం ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, పలువురిని ఆకట్టుకున్నాయి. మనదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, గీతంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కూడా పాల్గొన్న మోకు పందెం (టగ్-ఆఫ్ వార్) పోటీలు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

రుచికరమైన మిఠాయిలు, పొంగల్, సేద తీర్చే చెరకు రసం వంటి వాటన్నింటినీ అరటి ఆకులలో బంతి భోజనంలా వడ్డించడం విశేషం. ఇక విద్యార్థులు గాలి పటాలను ఎగరవేయడం, సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఈ సంక్రాంతి వేడుకలు విద్యార్థులలో సామూహిక స్ఫూర్తిని పెంపొందించాయి.ఈ వేడుకలు విద్యార్థులలో సామాజిక భావన, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని ఆతిథ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులలో ఐకమత్యాన్ని చాటడానికి, మన ఘన వారసత్వాన్ని గౌరవించడానికి, మొత్తంగా అవన్నీ శాశ్వత జ్జాపకాలుగా నిలిచిపోవడానికి వీలుకల్పించాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *