ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహం కోసం గీతం అవగాహన

Telangana

చెన్నా డిజిటల్ సొల్యూషన్స్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, ఇంక్లైన్ ఇన్వెన్షన్స్ తో విడివిడిగా ఒప్పందాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి, ఆవిష్కరణలను ప్రోత్సహించి, భవిష్యత్ నాయకులుగా, వ్యవస్థాపకులుగా వారు ఎదగడానికి మార్గం సుగమం చేసేలా ఇటీవల మూడు కీలకమైన అవగాహనా ఒప్పందాలను విడివిడిగా చేసుకుంది. చెన్నా డిజిటల్ సొల్యూషన్స్ (సీడీఎస్), స్ట్రక్చరల్ సొల్యూషన్స్ (ఎస్ఎస్), ఇంక్లైన్ ఇన్వెన్షన్స్ (ఐఐ)లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. పరిశ్రమలో విశ్వవిద్యాలయ సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ఎంవోయూలపై సంతకం చేసింది.అత్యాధునిక సాంకేతిక పరిజ్జానాన్ని అభివృద్ధి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థులకు ఇంటర్న్ షిప్, ప్లేస్ మెంట్ అవకాశాలను అందించడంపై సీడీఎస్ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం దృష్టి పెడుతుంది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరచి, వారిని ఆయా రంగాలకు తగ్గ నిపుణులుగా తీర్చిదిద్దడానికి స్ట్రక్చరల్ సొల్యూషన్స్ తోడ్పడుతుంది. గీతంలో సిలికార్ కోర్ ఏఐ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఇంక్లైన్ ఇన్వెన్షన్స్ ఏర్పాటు చేస్తుంది. ఇది సిస్టమ్-ఆన్-చిప్ (ఎస్ఓసీ) ప్లాట్ ఫారమ్ లలో కృత్రిమ మేథతో నడిచే వీడియో అనలిటిక్స్, ప్రసార పరిష్కారాలలో ప్రత్యేకత కలిగి ఉంది.

మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందాలపై గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్, సీడీఎస్ ఎండీ డి.సత్యనారాయణ చెన్నప్రగడ, ఎస్ఎస్ ఎండీ ఈ.ద్వారకానాథ్, ఐఐ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో డాక్టర్ బి.ప్రదీప్ కుమార్ సంతకాలు చేశారు. గీతం ప్రతినిధులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, ఫకృద్దీన్ షేక్, దామోదర్ తదితరులు ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ భాగస్వామ్యాలు విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ముఖ్యమైన దశను సూచిస్తున్నాయని, పరిశ్రమ ప్రముఖులతో కలిసి పనిచేయడం ద్వారా గీతం విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, వాస్తవ ప్రపంచ అనుభవంతో సన్నద్ధం చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ గుణశేఖరన్ పేర్కొన్నారు.ఆవిష్కరణ, వ్యవస్థాపకత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం చేయడం కోసం ఈ అవగాహనా ఒప్పందాలు ఉపకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *