‘రైటింగ్ ఆర్కిటెక్చర్’ పోటీలో ప్రత్యేక అవార్డు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నాసా 67వ ప్రాంతీయ కన్వెన్షన్-లో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెండో ఏడాది విద్యార్థిని రేష్మిక ‘రైటింగ్ ఆర్కిటెక్చర్’ పోటీలో ప్రత్యేక ప్రస్తావన అవార్డును అందుకుని, ఓ ప్రతిష్టాత్మక వేదికలో తన ప్రతిభను చాటినట్టు ఇన్ చార్జి డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఈ ఘనత గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కు ఓ అద్భుత క్షణమని, ఈ ప్రశంసలు గీతంలోని ఉన్నత విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తూ నిర్మాణ ఆలోచనలను విమర్శనాత్మకంగా విశ్లేషించి, సమర్థవంతంగా వెల్లడించడంలో రేష్మిక అసాధారణ సామర్థాన్ని చాటిచెప్పిందని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ లోని అరోరాస్ డిజైన్ అకాడమీలో ఇటీవల జరిగిన 67వ నాసా ప్రాంతీయ కన్వెన్షన్ లో దాదాపు 25 మంది మొదటి, రెండో ఏడాది గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు పాల్గొన్నట్టు ఆయన తెలియజేశారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం, భారతదేశం అంతటా ఉన్న ఔత్సాహిక ఆర్కిటెక్ట్ లను ఒకచోట చేర్చి, వారిలోని సృజనాత్మకత, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక క్రియాశీల వేదికను అందించిందన్నారు. ఇందులో భాగంగా, వివిధ రకాల వర్క్ షాపులు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా, విద్యార్థులంతా వాటిలో చురుకుగా పాల్గొని, ఆర్కిటెక్చర్ రంగంలో వారి అంకితభావాన్ని, క్రమశిక్షణతో నేర్చుకుని ఎదగడానికి ఉపకరించాయని ఆయన తెలిపారు.నాసా కన్వెన్షన్ విద్యార్థులకు అమూల్యమైన అభ్యాస అనుభవంగా నిరూపించబడడంతో పాటు నిర్మాణ పద్ధతులను అన్వేషించడానికి, కొత్త దృక్కోణాలను పొందే అవకాశాన్ని వారికి కల్పించిందని బందన్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. వర్క్ షాపులు, పోటీలకు అతీతంగా, ఈ కార్యక్రమం వివిధ సంస్థల సహచరుల మధ్య అర్థవంతమైన పరస్పర చర్యలను పెంపొందించిందని, తరువాతి తరం వాస్తుశిల్పులలో స్నేహభావాన్ని, సహకార అభ్యాసాన్ని పోత్సహించినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గీతం విద్యార్థులను అధ్యాపకురాలు శ్రుతి గావాలి సమన్వయం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
