గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న స్కాట్ లాండ్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ రంజన్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వాతావరణ మార్పుల వల్ల మనం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నామని, మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని స్కాట్ లాండ్ లోని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం పర్యావరణ, వాతావరణ న్యాయ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ రంజన్ హితవు పలికారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో ‘చిక్కుబడ్డ సంక్షోభం: హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసం, న్యాయం’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. వాతావరణ మార్పు, విపత్తుల సాంద్రత, తీవ్రతపై, ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో సంభవిస్తున్న పరిణామాలపై ఆయన దృష్టి సారించారు. దీనికి గల సాంకేతిక పరిష్కారాలను పదే పదే ప్రస్తావిస్తూనే, ఈ సంక్షోభాల భావోద్వేగ, మానవ కోణాలను విస్మరించడాన్ని ఆయన తప్పు పట్టారు.
డాక్టర్ రంజన్ తన వినూత్న పరిశోధన ద్వారా హిమాలయ ప్రాంతంలో వాతావరణ వైపరీత్యాల లోతైన చిక్కులను అర్థం చేసుకోవడానికి శోకంని ఒక ముఖ్యమైన అంశంగా పరిచయం చేశారు. వాతావరణ సంక్షోభం చుట్టూ మన కథనాలను రూపొందించడంలో మానవ బాధలను గుర్తించడం, ధృవీకరించడం చాలా అవసరమని ఆయన వాదించారు. వాతావరణ మార్పు ప్రభావిత కమ్యూనిటీలపై తీసుకునే భావోద్వేగ నష్టాన్ని బహిరంగంగా గుర్తించాలని సూచించారు.ఈ చర్చలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని, వాతావరణ విపత్తుల యొక్క మానవ కోణాలను అన్వేషించడానికి, వాతావరణ సంభాషణలో భావోద్వేగ కథనాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు.