యువత మార్పిడిలో భాగంగా నేపాల్ ను సందర్శించిన గీతం విద్యార్థి మహిత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శిఖలో మరో కలికితురాయి చేరింది. గీతం విద్యార్థిని మహితా కొండూరు మన దేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా నేపాల్ లో పర్యటించి, అక్కడి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని పొందారు. ఈ విషయాన్ని గీతం ఎన్.సీ.సీ. కేర్ టేకర్ ఆఫీసర్ ఎస్.అజయ్ కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నేపాల్ లో అక్టోబర్ 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఎన్.సీ.సీ. యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (వైఈపీ)లో సీనియర్ అండర్ ఆఫీసర్ మహిత కొండూరి విజయవంతంగా పాల్గొన్నారని, మన దేశం నుంచి మొత్తం 16 మందిని క్యాడెట్ లను ఎంపిక చేయగా, అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి మహిత ఒక్కరే ప్రాతినిధ్యం వహించినట్టు ఆయన వివరించారు.మహిత నేపాల్ లో ఉన్న సమయంలో అనేక కార్యకలాపాలలో పాల్గొనడమే గాక, సాహసోపేతమైన ‘జంగిల్ సఫారీ’లో కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఆమె అంకితభావం, శ్రేష్టమైన ప్రదర్శనలను గుర్తించిన నేపాల్ లోని ఎన్.సీ.సీ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సురేశ్ కుమార్ కర్కి ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని స్వయంగా అందజేశారన్నారు.భారతదేశ సాంస్కృతిక రాయబారిగా మహిత సాధించిన విజయాలు, ఆమె నిర్వహించిన పాత్రను గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, క్రీడలు-ఎన్.సీ.సీ. డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ ఉపాధ్యాయ తదితరులు ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.నేపాల్ లో మహిత అనుభవం ఆమె వ్యక్తిగత అభివృద్ధిని మెరుగుపరచడమే కాకుండా, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన క్యాడెట్ ల మధ్య గొప్ప స్నేహాన్ని, ఆలోచనల మార్పిడిని కూడా ప్రోత్సహించినట్టు తెలిపారు.