రక్తదానం ప్రాణదానంతో సమానం
ప్రశంసా పత్రాలను అందజేసిన రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి విద్యార్థి చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరో వ్యక్తి లేదా వ్యక్తులకు ఉపయోగపడుతుందని గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), చరైవేతి విద్యార్థి విభాగాలు శుక్రవారం సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో, ‘రక్తదానం చేయండి, జీవితాన్ని దానం చేయండి’ ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిబిరానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నుంచి విశేషమైన స్పందన కనిపించింది. ఈ శిబిరాన్ని నిర్వహించడంలో విద్యార్థుల అంకితభావాన్ని ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రశంసించారు. ఇలాంటి మానవతా ప్రయత్నాలలో నిరంతరం పాల్గొనాలని ఆయన ప్రోత్సహించారు. రక్తదానం విలువను నొక్కి చెబుతూ, ఇందులో స్వచ్ఛందంగా పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, రక్తదానం విశిష్టత, తద్వారా దాత, గ్రహీతలు ఇద్దరికీ ఒనగూరే ప్రయోజనాల గురించి వివరించారు. దాతలకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు, విద్యార్థి నాయకులతో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ శిబిరంలో 300 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్టు ఎన్టీఆర్ ట్రస్టు వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ శైలజ, అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాధవి తెలియజేశారు. రక్తదానాన్ని ‘జీవిత బహుమతి’గా వారు అభివర్ణిస్తూ, ప్రతి దానం వివిధ వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఎర్ర రక్తకణాలు, ప్లేట్-లెట్లు, ప్లాస్మాను అందించడం ద్వారా చాలామంది జీవితాలను కాపాడవచ్చని చెప్పారు.